రిజిస్ట్రేషన్ శాఖలో లుకలుకలు... ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్లతో ఆ అధికారి మంతనాలు... తప్పుడు రిపోర్ట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం...

Submitted by SANJEEVAIAH on Mon, 07/08/2023 - 09:45
Photo

రిజిస్ట్రేషన్ లో లుకలుకలు

అసలేం జరుగుతుంది

ఇంచార్జీలతో అధికారి మంతనాలు

బుకాయించేందుకు ముందస్తు ప్రయత్నం

తెరపైకి కొత్త రాజకీయులు

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. "ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగడు" అన్నట్లు అసలు భాగోతం బయటకు రాకుండా జిల్లా స్టాయి అధికారి పావులు కదుపుతున్నారు. అందుకు జిల్లా కార్యాలయంలోని ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ వసూళ్ల క్రమానికి తెర లేపారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ జిల్లాలో యదేచ్చగా సాగిపోతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇక్కడ "మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఈ వ్యవహరం రోజు రోజుకు ముదురుతోంది. ఈ శాఖలో జరుగుతున్న పెండింగ్ దస్తావేజుల భాగోతంపై "ప్రజాజ్యోతి" దిన పత్రిక వరుస కథనాలతో బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కథనాలపై ఉన్నతాధికారులు స్పందించినట్లు తెలిసింది.

సర్వం సిద్ధం చేస్తూ...

 పెండింగ్ డాక్యుమెంట్ల వ్యవహారంపై జిల్లా రిజిస్ట్రార్ ను ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం. దీంతో  ఈ అవినీతి, అక్రమాల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఇన్చార్జీ సబ్ రిజిస్ట్రార్ లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదంతా తనకు తెలిసే జరగడంతో తల పట్టుకున్న ఓ కీలక అధికారి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. అందుకోసం కొత్తదారులు వెతుకుతున్నారు. చాకచక్యంగా తప్పించుకునేందుకు ఇన్చార్జిలతో మంతనాలు మొదలెట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు, ముగ్గురు ఇన్చార్జి అధికారులతో తన ఛాంబర్ లో శనివారం సమావేశమై పైస్థాయి అధికారిని ఏ విధంగా బుకాయించాలని సమాలోచనలు చేసినట్లు తెలిసింది. కామారెడ్డి అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలోగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో నాన్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందని, ఇందుకుగాను తాను లంచం స్వీకరించలేదని ఉన్నతాధికారి ఎదుట  ప్రాధేయ పడాలని ఆ అధికారి ఇన్చార్జికి ఉద్బోధించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అర్బన్ కార్యాలయంలో జరిగిన అక్రమాల నుంచి బయటపడేందుకు మరో ఎత్తుగడ వేశారు. ఇప్పటికే పూర్తి చేసిన డాక్యుమెంట్లను ఏ విధంగా సమాధానం చెప్పాలి, అవసరం అయితే రాత పూర్వకంగా ఎలా ఇవ్వాలని సిద్ధం చేయడం విశేషం. అలాగే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోని పలు దస్తావేజులకు పెండింగ్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చిందని, అవసరమైతే క్రయ విక్రయ దారులకు నోటీసులు జారీ చేసి ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి ఉన్నతాధికారిని బుట్టలో వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ పెండింగ్ డాక్యుమెంట్లకు రెగ్యులర్ నెంబర్లు జారీ చేసింది ఒకే అధికారి కావడం విశేషం. భేరా సారాలు జరుపుతూ గుట్టు చప్పుడు కాకుండా నాన్ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ఆ కీలక అధికారి, మరోసారి తనకంటే దిగువ స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకొని ఈ వ్యవహారం నుంచి సాఫీగా బయటపడేందుకు కుట్రలు పన్నుతున్నారు. రెండు సందర్భాల్లోనూ ఇప్పటికే రెండు పర్యాయాలు సస్పెండ్ అయిన ఓ సీనియర్ అసిస్టెంట్ పెండింగ్ దస్తావేజులను రెగ్యులర్ చేసేందుకు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా భాద్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో ఈ అవినీతి మరకను అవసరమైతే ఆయనకే అంటించాలని ఆ కీలక అధికారి యత్నిస్తున్నట్లు శనివారం జరిగిన సమావేశం సారాంశంగా చెప్పుకోవచ్చు.

అక్కడంతే...

 ఇదిలా ఉండగా, అర్బన్ కార్యాలయంలో జరిగిన కూర్చీలాట విషయాన్ని ఉన్నతాధికారి ప్రశ్నిస్తే, రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ స్థానికంగా ఉండక పోవడంతో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని, అందుకే ఆమెకు జాయింట్ -2 బాధ్యతలు అప్పగించినట్లు చెప్పి తప్పించుకోవాలని యత్నిస్తున్నారు. ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ అన్నితానై చక్కబెట్టడం వెనుక జిల్లా అధికారి ఉండటంతో సదరు అధికారి డాక్యుమెంట్లు చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు ఫైల్ ను బట్టి వసూల్ చేస్తున్న ఆ శాఖలో, డాక్యుమెంట్ రైటర్లలో చర్చ జరిగుతుంది. నిజానికి కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం సదరు అధికారికి తెలిసే జరిగింది. అంతేగాక, పెండింగ్ నెంబర్ లు జారీ చేసి, కొంత కాలం తర్వాత రెగ్యులర్ నెంబర్లు ఇవ్వాలని మౌఖికంగా ఐడియా ఇచ్చింది సదరు అధికారి కావడం కొసమెరుపు. అయినప్పటికీ తనకేమీ తెలియదని, పని ఒత్తిడితో ఆ కార్యాలయాలను తాను తనిఖీ చేయలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని పైఅధికారిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. లక్షల రూపాయలు చేతులు మారినా సునాయసంగా తప్పించు కోవాలని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ పెండింగ్ డాక్యుమెంట్ల వ్యవహారంలో లోతైన విచారణకు ఆదేశిస్తే అవినీతి బాగోతం పూర్తిస్థాయిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.


తరువాయి భాగంలో:-
ఆ"గని" అక్రమాలు... తప్పించుకునే సూత్రదారి...
ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు ప్రోహిబిషన్ లిస్టులో... డాక్యుమెంట్ కు ఓ రేటు... కాసులిస్తేనే రిలీజ్... తలలు పట్టుకుంటున్నా బాధితులు...