నా దేశ యువతను చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది..!!

Submitted by Praneeth Kumar on Tue, 18/07/2023 - 16:59
I am very proud to see the youth of my country..!!

నా దేశ యువతను చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది..!! 
◆ ఎందుకు అంటారా, చదవండి.

హైదరాబాద్, జులై 18, ప్రజాజ్యోతి.

దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన యువత మతం గురించి మాట్లాడుకుంటున్నందుకు.
దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోతుంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత మూడు గంటల సినిమా గురించి చర్చ చేస్తున్నందుకు.
అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు తగ్గినప్పుడు, మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత.. హిందూ, ముస్లిం గొడవల గురించి మాట్లాడుతున్నందుకు.
మేము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని, అధికారంలోకి వచ్చి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత ప్రశ్నించకుండా హిజాబ్ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నందుకు.
నేను అధికారంలోకి వస్తే నల్లధనం తీసుకు వచ్చి పేదల బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్భాలు పలికి అధికారాన్ని సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని చేవ చచ్చిన మనుషులుగా మారి బ్రతుకుతున్నందుకు.
స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్ ఎందుకు నిర్మించట్లేదు అని ఆలోచించాల్సిన యువత గుడి నిర్మాణాల గురించి మాట్లాడుతున్నందుకు.
ప్రభుత్వరంగ సంస్థలు నిర్మించాల్సింది పోయి వాటిని కారు చౌకగా తన కార్పొరేట్ మిత్రులకు అమ్ముతుంటే.. ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు మూగబొయినందుకు.
కరోనా మరణాలు, వలస కార్మికుల ఆకలి చావులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు హాయిగా మర్చిపోయిన యువత మళ్ళీ.. మళ్ళీ.. మా ఓటు మీకే అంటూ బానిసలుగా మారినందుకు.
స్పందన ఆగిన వీరి హృదయాలను ఏ మంటలలో వేయాలి, ఆలోచిండం ఆగిపోయిన వీరి మెదళ్ళను ఏ కొలిమిలో కాల్చాలి.
నిజంగా గర్వంగా ఉంది భారతీయుడా.. నిజంగా గర్వంగా ఉంది.