జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా విడాకుల విషయంలో పరస్పరం చర్చించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తన భార్య పాయల్‌తో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది.
దంపతులిద్దరూ తమ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైనప్పటికీ, దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరువురూ కూర్చొని తమ మధ్య వివాదానికి దారితీసిన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య గత కొన్నేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భార్య పాయల్‌తో విడాకులు కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.