రాబిన్ హుడ్’ మూవీ రివ్యూ
నటీనటులు: నితిన్-శ్రీలీల-దేవ్ దత్త నాగె-రాజేంద్ర ప్రసాద్-షైన్ టామ్ చాకో- వెన్నెల కిషోర్-సిజ్జు-శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి-నవీన్ ఎర్నేని
రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల
‘భీష్మ’ చిత్రంతో మెప్పించిన జోడీ నితిన్-వెంకీ కుడుముల. మళ్లీ వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం.. రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రామ్ (నితిన్) ఒక అనాథ. తాను ఉంటున్న అనాథ శరాణలయానికి డబ్బుల సమస్య రావడంతో చిన్నతనంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు. బడా బాబుల ఇళ్లలో డబ్బులు దోచుకుని తన లాంటి అనాథల కడుపు నింపుతుంటాడు. దీంతో తన పేరు రాబిన్ హుడ్ గా మారుతుంది. ఐతే విక్టర్ (షైన్ టామ్ చాకో) అనే పోలీస్ అధికారి తన మీద స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రాబిన్ హుడ్ అప్రమత్తం అవుతాడు. కొన్నాళ్లు దొంగతనాలు మానేసి.. సెక్యూరిటీ ఏజెంట్ పనికి కుదురుతాడు. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద కంపెనీ యజమాని తనయురాలైన నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వచ్చి వెళ్తుంటే.. ఆమె రక్షణ బాధ్యతలను రాబిన్ హుడ్ చేపడతాడు. ఐతే ఆమెను పనిగట్టుకుని రుద్రకొండ అనే ఊరికి రప్పిస్తుంది ఒక డాన్ గ్యాంగ్. మరి ఆ గ్యాంగ్ లక్ష్యం ఏంటి.. వారి నుంచి రాబిన్ హుడ్ ఆమెను కాపాడాడా.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఛలో.. భీష్మ చిత్రాలతో రచయితగా-దర్శకుడిగా బలమైన ముద్రే వేశాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఆ రెండు చిత్రాలకు ప్రధాన ఆకర్షణ ఎంటర్టైన్మెంటే. తన గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టయిల్లోనే వన్ లైనర్స్.. పంచు డైలాగులతో సటిల్ గా కామెడీ పండిస్తూనే మరోవైపు స్టోరీల్లో చిన్న చిన్న ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించాడు వెంకీ. ‘రాబిన్ హుడ్’ ప్రోమోలు చూసినా కామెడీకి ఢోకా లేనట్లే కనిపించింది. ఇక ఈ సినిమా ప్రమోషనల్ వీడియోల్లో ఫన్ చూస్తే సినిమాలో ఇంకెంత వినోదం ఉంటుందో అనుకున్నారు ప్రేక్షకులు. ఐతే కామెడీ పరంగా ‘రాబిన్ హుడ్’ నిరాశ పరచని సినిమానే. మరీ పేలిపోయే కామెడీ అని చెప్పలేం కానీ.. ప్రేక్షకులు అక్కడక్కడా బాగానే నవ్వుకుంటారు. కానీ కేవలం కామెడీ మీదే ఆధారపడి సినిమాలు నడవవు కదా? కథలో విషయం ఉండాలి. కొత్త సీన్లు పడాలి. అక్కడే ‘రాబిన్ హుడ్’ నిరాశ పరుస్తుంది. కామెడీ మీదే ఫోకస్ పెట్టిన వెంకీ.. కథ పరంగా ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ టెంప్లేట్ ఫాలో అయిపోవడంతో ఆ విషయంలో నిరాశ తప్పదు. సినిమా ఏదో అలా టైంపాస్ అయితే అయిపోతుంది కానీ.. బలమైన ఇంపాక్ట్ వేయలేకపోయింది. కామెడీ కోసం ఒకసారి చూడ్డానికి మాత్రం ఢోకా లేని సినిమా ఇది.