వరంగల్ బ్యూరో, మార్చి 8 (ప్రజాజ్యోతి):
కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు..
* కుమారుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు
* కెనాల్ నుండి భార్యను కాపాడిన స్థానికులు
* వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద కెనాల్ లో ప్రమాదం
* గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు..
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు కెనాల్ లోకి దూసుకెళ్లి తండ్రి, కూతురు కెనాల్ లో గల్లంతు కాగా, కుమారుడు మృతి చెందాడు. ప్రమాదం గమనించిన స్థానికులు భార్యను కాపడగలిగారు. వీరిది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామం. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30) తోపాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వరంగల్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు వీరు ప్రయాణిస్తున్న కారు ఎస్సారెస్పీ కెనాల్లో కి దూసుకెళ్ళి ప్రమాదం జరిగింది. దీంతో ప్రవీణ్ ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. అప్పటికే బాబు మరణించాడు. ప్రవీణ్ , ఆయన కూతురు కారు సహా నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నారు.