ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని రెండు నివేదికలు ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను దాచిందని విమర్శించారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన ప్రభుత్వం సొరంగం పనులపై నిర్లక్ష్య ధోరణితో ముందుకు పోయిందని అన్నారు.
ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు వచ్చాయని, కానీ కమీషన్ల కోసం ఈ పనులను ప్రారంభించారని ఆరోపించారు. ఆ నివేదికలలో చెప్పినట్లుగానే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రస్తుతం ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎనిమిది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వేల కోట్ల ప్రభుత్వ ధనం వృథా అయిందని అన్నారు. ఈ ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.