నిరసనలు చేస్తే కుదరదు.. నిధులు నిలిపేస్తా: విద్యాసంస్థలకు ట్రంప్ వార్నింగ్
చట్ట విరుద్ధంగా నిరసనలు తెలిపే విద్యాసంస్థలకు హెచ్చరిక
కేంద్రం నిధులు నిలిపివేస్తానని వార్నింగ్
ఆందోళనకారులకు బహిష్కరణ లేదా అరెస్టు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరిక
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆయన మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర నిధులను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
అంతేకాకుండా ఆందోళనకారులకు జైలు శిక్ష లేదా బహిష్కరణ తప్పదని పేర్కొన్నారు. అమెరికా విద్యార్థులైతే తీవ్రతను బట్టి శాశ్వత బహిష్కరణ లేదా అరెస్టు వంటి చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు అంటూ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.