యూఏఈలో భారత మహిళకు మరణశిక్ష అమలు

V. Sai Krishna Reddy
2 Min Read

నాలుగేళ్ల చిన్నారి మృతి కేసులో భారతీయ మహిళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్ష అమలయింది. గత నెల 15వ తేదీన శిక్షను అమలు చేసినప్పటికీ, ఆ విషయాన్ని సోమవారం విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లోని జందా జిల్లాకు చెందిన మహిళ (30) నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణలపై అబుదాబీలో మరణ శిక్షను ఎదుర్కొంది. యుఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15న షహజాదీ ఖాన్‌కు మరణశిక్షను అమలు చేశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు. కుమార్తెను శిక్ష నుంచి తప్పించడానికి ఆమె తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. షహజాది ఖాన్ 2021 డిసెంబర్‌లో అబుదాబీకి వెళ్లింది. ఫైజ్ – నాడియా దంపతుల ఇంట్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. 2022 ఆగస్టులో ఆమె యజమానికి ఒక కొడుకు జన్మించగా, ఆ బాలుడి సంరక్షణ షహజాది ఖాన్ చూసుకుంటోంది. ఆ క్రమంలో సాధారణ టీకాలు వేసిన తర్వాత ఆ బాలుడు 2022 డిసెంబర్ 7న మృతి చెందాడు. అయితే తమ చిన్నారి మృతికి ఖాన్ కారణమని బాలుడి తల్లిదండ్రులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు.

ఈ కేసు విచారణ జరిపిన కోర్టు గత ఏడాది ఫిబ్రవరి 28న మరణశిక్షను విధించింది. ఈ క్రమంలో షహజాది ఖాన్ తండ్రి షబ్బీర్ ఖాన్ తన కుతురును రక్షించాలని కోరుతూ భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. అయితే భారత విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యుఏఈ కఠిన చట్టాలు, నిబంధనల ప్రకారం ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. షహజాది ఖాన్ కు మరణశిక్షను అమలు చేసినట్టు గత నెల 28న యుఏఈలోని భారత రాయబార కార్యాలయానికి అధికారిక సమాచారం అందింది. ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చైతన్ శర్మ ఢిల్లీ కోర్టుకు తెలిపారు.

అయితే, శిక్ష అమలు చేసే సమయంలో జైలు అధికారులు షహజాది ఖాన్‌ను చివరి కోరికను అడగ్గా, తల్లిదండ్రులతో మాట్లాడాలని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులకు జైలు అధికారులు ఫోన్ చేసి మాట్లాడించారు. తాను ఏ తప్పు చేయలేదని షహజాది ఖాన్ తల్లిదండ్రులతో చెప్పి విలపించింది. ఆ తర్వాత జైలు అధికారులు ఆమెకు శిక్షను అమలు చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *