హైదరాబాద్ శివార్లలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు.
లంగర్‌హౌస్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మొదటి అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువచ్చారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన వారిని ఏడేళ్ల సిజిరా, సహానా (40), జమీలా (70)గా గుర్తించారు. మంటలు చెలరేగడంతో భవనంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, సాయంత్రం సుమారు ఐదున్నర గంటలకు తమకు ఫోన్ వచ్చిందని, ఘటనాస్థలికి చేరుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలను అదుపు చేసే సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలిసిందని వెల్లడించారు. నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్‌కు చేరుకొని, తలుపులను పగులగొట్టి ఒక చిన్నారి, ఇద్దరు మహిళలను బయటకు తీసుకువచ్చామని తెలిపారు. వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.