అనేక దేశాల మాదిరే భారత్ కూడా విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు ఈవీ మోడళ్లు తీసుకువచ్చాయి. అంతర్జాతీయ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ కూడా కామెట్ పేరుతో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది చూడడానికి చిన్నదిగా కనిపించినా, ఫీచర్ల పరంగా ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తుంది.
తాజాగా ఎంజీ ఇండియా తన కామెట్ మోడల్ కు బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. ఇది బ్లాక్ కలర్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎంజీ కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.8 లక్షలు. బ్యాటరీ ధర అదనం. ప్రీ బుకింగ్ సమయంలో ముందుగా రూ.11 వేలు టోకెన్ అమౌంట్ గా చెల్లించాలి.
దీని స్పెసిఫికేషన్స్ చూస్తే… ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో బ్యాటరీని 7.4 కిలోవాట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే 3.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీంట్లోని మోటార్ 110 ఎన్ఎం టార్క్ తో 41 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, కీ లెస్ ఎంట్రీ, ఫుల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ రెడ్ హైలైట్, ఫోల్డబుల్ వ్యూయింగ్ మిర్రర్స్, మాన్యువల్ ఏసీ/హీటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఇది టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు పోటీగా భావిస్తున్నారు