మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి నాని కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
చిరంజీవి సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.
నాని విషయానికి వస్తే… ప్రియదర్శి ప్రధాన పాత్రలో నాని సమర్పణలో ‘కోర్ట్’ సినిమా తెరకెక్కింది. వచ్చే నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నాని ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ… చిరంజీవి సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు.