ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల మోత మోగిన నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ పోరులో ఆసీస్ 352 పరుగుల టార్గెట్ ను సక్సెస్ పుల్ గా చేజ్ చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోష్ ఇంగ్లిస్ (120 నాటౌట్) వీరోచితసెంచరీతో తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ట్రావిస్ హెడ్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) స్వల్ప స్కోర్లకే అవుటైన స్థితిలో… ఇంగ్లిస్ బ్యాట్ తో వీరవిహారం చేశాడు. 86 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లిస్ కు తోడు ఆఖర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టు మరో 15 బంతులు మిగిలుండగానే… 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్ వెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.