సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శుభవార్తను అందించింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్‌సీ మరోసారి పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి గానూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
జనవరి 22న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా, అధికారులు ఆ గడువును ఫిబ్రవరి 18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు మంగళవారంతో ముగియనుండటంతో ఫిబ్రవరి 21 వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న జరగనుంది.
దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్‌సీ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇండియన్ ఫారెస్టు సర్వీసులో మరో 150 పోస్టులకు సైతం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు