నర్సంపేట పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తూ మణించిన పోలీస్ కుటుంబానికి వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా భద్రత చెక్కు అందజేశారు. ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే.. నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం తో మరణించాడు. దీనితో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరు చేసిన 7లక్షల 89 వేల రూపాయల చెక్కును పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ సతీమణి లీలకు అందజేసారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.