కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుంటుండడంతో జనం భారీగా అప్లై చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఎన్నికల కమిషన్ జోక్యంతో మధ్యలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. మొత్తంగా ఆరు రోజుల వ్యవధిలో 1.01 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ మీ సేవా కేంద్రాల్లో రద్దీ కొనసాగుతోందని, ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతున్నారని చెప్పారు.
ప్రజాపాలన సభలలో ఇప్పటి వరకు 40 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో జనం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అప్లై చేసుకుంటున్నారు. మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దీ ఏర్పడుతోంది. కొన్నిచోట్ల సాంకేతిక కారణాల కారణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ జనం వేచి ఉండి దరఖాస్తులు ఇచ్చాకే వెళుతున్నారని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఆధార్ అప్ డేట్, కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో జనం మీ సేవా కేంద్రాలకు వెళుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే క్యూ కడుతున్నారు. జనం భారీగా వస్తుండడంతో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. ప్రతీ దరఖాస్తుకు ఫీజుగా రూ.45 తీసుకోవాల్సి ఉండగా కొన్ని కేంద్రాల్లో రూ.150 వరకు వసూలు చేస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. దీంతో పలు మీ సేవా కేంద్రాల వద్ద అధికారులు నిఘా పెట్టారు. నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నారు.