జగన్, వి.సా.రెడ్డి మధ్య ఎదురుపడలేనంత దూరం
విజయసాయిరెడ్డి, జగన్ వేర్వేరు కాదు. జగన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ దగ్గర నుంచి రాజకీయంగా ముఖ్యమంత్రిగా ఎదిగే వరకూ ప్రతి అడుగులోనూ విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. దాన్ని ఎవరూ విస్మరించలేరు. జగన్ విస్మరించినట్లుగా ఉన్నారన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా రాజకీయ సన్యాసం ప్రకటించారు. అది జగన్ లండన్ లో ఉన్నప్పుడు జరిగింది. అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి ప్రకటించాలని అనుకున్నారు. అందుకే రాజ్యసభకు రాజీనామా చేసినా.. పార్టీకి మాత్రం జగన్ వచ్చే వరకూ రాజీనామా చేయలేదు.
జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఓ సారి కావాలని విజయసాయిరెడ్డి అనుకున్నారు. ఆ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మీడియాకు తెలియకపోయినా వ్యక్తిగతంగా అయినా కలిసి మాట్లాడాలని అనుకున్నారు. కానీ జగన్ చాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. తనతో ఇంత కాలం ప్రయాణించి..తన ఎదుగుదల, పతనాల్లో వెంట ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కనీసం కనుక్కునే ప్రయత్నం చేయకపోవడం వైసీపీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఎవరికీ తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డికి రెండో సారి రాజ్యసభ స్థానం వస్తుందని ఎవరూ అనుకోలేదు. రాదని అనుకున్నారు. అయితే భారతి రెడ్డితో చెప్పించుకుని ఆయన రెండో సారి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని చెబుతారు. అందుకే విజయసాయిరెడ్డి తనకు రాజ్యసభ సీటు వచ్చినప్పుడు.. రాజీనామా చేసినప్పుడు కూడా భారతి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. గ్యాప్ ఎక్కడ వచ్చిందో కానీ జగన్, విజయసాయిరెడ్డి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనంత పరిస్థితికి వెళ్లిపోయారు.