కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం ఇదే !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాదు మొత్తం రాజకీయవర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వం విషయంలో అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం హాట్ టాపిక్ అయింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో సమావేశం కావడం.. ఆయన మీడియాకు లీక్ చేయడంతో మొత్తం గగ్గోలు రేగింది. అయితే అసలు వారి సమస్య ఏమిటన్నది హైలెట్ కాలేదు. అనిరుధ్ రెడ్డి ఏదో ఫైల్ క్లియర్ చేయలేదని అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. ఆయనకు మద్దతుగా మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు?. దాదాపుగా ఎమ్మెల్యేలందరిలోనూ కొన్ని అంశాలపై తీవ్ర అసంతృప్తి ఉంది.
ప్రచారం జరుగుతున్నట్లు కీలకమైన మంత్రి విషయంలోనే వారు అసంతృప్తికి గురవుతున్నారన్నది నిజం కాదని ఆయనపై కన్నా అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. హైకమాండ్ వద్ద పలుకుబడి తనకే ఉందని మరో కీలక మంత్రి దాదాపుగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతున్నారు. ఆర్థిక పరమైన వ్యవహారాన్నీ చేతుల్లో ఉండటంతో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆ మంత్రి సతీమణి ప్రత్యేకంగా క్యాంప్ ఆఫీసు పెట్టుకుని మరీ కలెక్షన్లు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ మంత్రీ సతీమణి సొంత పార్టీ నేతల్ని కూడా వదలడం లేదని.. ఎవరైనా సరే మూల్యం చెల్లించాల్సిందే అన్నట్లుగా ఉండటం.. ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్యేలందరిపై పడిందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులుకాస్త తక్కువ గానే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు తమకు, తమ క్యాడర్ కు రావాల్సిన , కావాల్సిన పనుల విషయంలో సంతృప్తిగా లేరు. అదే సమయంలో అదేదో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్లుగా కమిషన్లు వసూలు చేయడం కూడా వారికి నచ్చలేదు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అయినప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో సీనియర్లను ఆయన ప్రశ్నించే అవకాశం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు సొంతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు.
మంత్రి భార్య పర్సంటేజీల కలెక్షన్ల గురించి అంతా బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఇమేజ్ ఆ మంత్రికి రావడం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం ఉంది. చాలా మంది మంత్రులు ఉన్నా.. వారెవరిపైనా ఇలాంటి అభియోగాలు రావడలేదు. కేవలం ఆ మంత్రి మీదనే వస్తున్నాయి. అది సొంత పార్టీ నేతల్నీ వదిలి పెట్టకపోవడంతో బద్దలయ్యే పరిస్థితి వచ్చింది.