విద్య పేరుతో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు..
ఏకశిలాపై విచారణ జరపాలి..
ఫీజుల దోపిడీ, అనుమతులు, నియామకాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి..
టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్..
హనుమకొండ జిల్లా ప్రతినిధి నవంబర్ 25 (ప్రజాజ్యోతి):
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హనుమకొండ జిల్లాలోని ఏకశిలా విద్యాసంస్థల నిర్వహణ, ప్రభుత్వ అనుమతులు, ఫీజుల వసూళ్లు, ఉపాధ్యాయుల నియామకాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్ మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఏకశిలా విద్యాసంస్థల్లో తక్షణమే సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు, గుర్తింపులు, ఫీజుల వసూళ్లు, అదనపు ఛార్జీలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు, నియామకాలు, విద్యార్థుల భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, పీఎం శ్రీ పథకాల అమలు, వాటికి కేటాయించిన నిధుల వినియోగంపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టాలని కోరారు. ఆర్థిక అవకతవకలు, లంచాలు, అవినీతికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తే ఏసీబీ ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, విద్యాసంస్థల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, విద్య వ్యాపారంగా మారకుండా, విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా విద్యాసంస్థలు పనిచేయాలని, విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. ఈ కార్యక్రమంలో జేరిపోతుల వంశీకృష్ణ, రామంచ శ్రీను, కోట నాగరాజు, ఎండీ హసన్ తదితరులు పాల్గొన్నారు.
