నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపాటు - చేర్యాల జేఏసీ నేతల అరెస్టును తీవ్రంగా ఖండించిన జనగామ ఎమ్మెల్యే - అమరవీరుల సాక్షిగా ప్రజా గొంతుకను నొక్కేయడం అప్రజాస్వామికం

Siddipet Bureau
1 Min Read

చేర్యాల,మార్చి 26 (ప్రజాజ్యోతి):
చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న జేఏసీ నాయకులను, విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడంపై జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగించడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట ఇచ్చి, నేడు ఆ హామీని గాలికొదిలేయడం చేర్యాల ప్రజలను వంచించడమే” అని విమర్శించారు. చేర్యాల ప్రాంతానికి ఉన్న అన్ని అర్హతలను పరిగణనలోకి తీసుకుని డివిజన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో నాలుగు సార్లు విన్నవించినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆవేదనను వెళ్లబోసుకునే హక్కు ప్రజలకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ వద్ద అరెస్టు చేసిన జేఏసీ నేతలను, విద్యార్థులను ఎటువంటి నిబంధనలు లేకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి చేర్యాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వరకు బాధితుల పక్షాన అసెంబ్లీ లోపల, బయట తన పోరాటం కొనసాగుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *