టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ కు ఓటమి రుచి చూపిన వెస్టిండీస్

V. Sai Krishna Reddy
1 Min Read

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (76*) ఆకాశమే హద్దుగా చెలరేగడం, ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా రాణించడంతో కరీబియన్ జట్టు సునాయాసంగా గెలిచింది.

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30) మంచి ఆరంభాన్నిచ్చాడు. అయితే, పవర్ ప్లే తర్వాత విండీస్ బౌలర్లు పట్టు బిగించారు. ముఖ్యంగా స్పిన్నర్లు గుడాకేశ్ మోతీ (3/33), రోస్టన్ చేజ్ (2/29) వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా శామ్ కరన్ (30 బంతుల్లో 43*) ఒంటరి పోరాటం చేశాడు. కానీ, అతనికి సహకారం కరవవడంతో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది.

అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 8 పరుగులకే ఓపెనర్లు షై హోప్ (0), బ్రాండన్ కింగ్ (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోస్టన్ చేజ్ (34) కాసేపు నిలదొక్కుకున్నా, అసలు సిసలు విధ్వంసం షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ నుంచి వచ్చింది. కేవలం 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి చివర్లో జాసన్ హోల్డర్ (17 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *