భారత్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రత కారణాల వల్ల తమ ఆటగాళ్లు భారత్ లో మ్యాచ్ లు ఆడలేరని, తమ జట్టు ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, ఈ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. భారత్ లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది.
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు కోల్కతా, ముంబయిలలో గ్రూప్ మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో వీటిని చెన్నై, తిరువనంతపురం మార్చి, అక్కడ ఆడాలని బీసీబీకి ఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను బీసీబీ తిరస్కరించినట్లుగా సమాచారం. తమ ప్రభుత్వ అనుమతితో నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీబీ చెబుతోంది. కాగా, బంగ్లాదేశ్ లో హిందువులపై కొనసాగుతున్న దాడులకు నిరసనగా ఐపీఎల్ నుంచి ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రిలీవ్ చేసింది.
బంగ్లా క్రికెటర్ ను ఐపీఎల్ లో ఆడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆడబోమని ప్రకటించింది. కాగా, ఆదివారం వడోదర వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు బంగ్లాదేశ్ కు చెందిన సర్ఫుద్దౌలా సైకత్ అంపైర్ గా వ్యవహరించారు. భారత్లో తమ జట్టు సభ్యుల భద్రతపై బీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంపైర్ గా సైకత్ సాఫీగా విధులు నిర్వహించిన విషయాన్ని ఐసీసీ ప్రస్తావించే అవకాశముంది.
