సంక్రాంతి పండగ సీజన్‌లో అమ్మకాలు పెంచుకునేందుకు వస్త్ర దుకాణాలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని జీఎల్‌ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఆలోచించిన ఓ కొత్త ఆఫర్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇచ్చే 10, 20 శాతం డిస్కౌంట్లకు బదులుగా, వినియోగదారుడి బరువు ఆధారంగా రాయితీ ఇస్తూ అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది.
ఈ ఆఫర్ కోసం దుకాణం లోపల ప్రత్యేకంగా ఒక వెయింగ్ మెషిన్‌ను ఏర్పాటు చేశారు. బట్టలు కొనుగోలు చేసిన తర్వాత బిల్ చెల్లించే ముందు కస్టమర్‌ను దానిపై నిలబెట్టి బరువు చూస్తున్నారు. వారి బరువులో సగం శాతాన్ని డిస్కౌంట్‌గా అందిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి బరువు 80 కేజీలు ఉంటే, అతనికి కొనుగోలుపై 40 శాతం రాయితీ లభిస్తుంది. అదే 100 కేజీలు ఉన్నవారికి ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఈ వినూత్నమైన డిస్కౌంట్ విధానం గురించి తెలియడంతో జనం షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పండగ కొనుగోళ్ల కోసం వస్తున్న వారు ఈ కొత్త ఆఫర్‌తో ఆశ్చర్యపోతూ, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రియేటివ్ ఐడియా ద్వారా దుకాణానికి మంచి ప్రచారం లభించడంతో పాటు అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
