నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) తేదీలు ఖరారయ్యాయి. 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన-2026 వివరాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన, ఫిబ్రవరి 15 వరకు మొత్తం 45 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి ప్రారంభిస్తారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈసారి ప్రవేశ టికెట్ ధరను రూ.50గా నిర్ణయించినట్లు చెప్పారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని స్పష్టం చేశారు.
మొత్తం 1,050 స్టాళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు
