ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు మీరుతున్నారు. చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట ఏకంగా రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద ప్రేమాయణం సాగించి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఓ ప్రేమ జంట ఏకాంతం కోసం ప్రమాదకరమైన ప్రదేశాన్ని ఎంచుకుంది. రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలు కింద కూర్చుని ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రేమలో మునిగిపోయారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తమ లోకంలో విహరిస్తున్నారు. పసుపు రంగు చీర ధరించిన మహిళను ఆమె ప్రియుడు ఆలింగనం చేసుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
వారు అలా రొమాన్స్‌లో మునిగిపోయి ఉండగా, అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. దీంతో ఉలిక్కిపడిన ఆ జంట, వెంటనే తేరుకుని ప్రాణభయంతో ట్రాక్‌పై నుంచి పక్కకు దూకేశారు. వారు పక్కకు జరిగిన కొద్ది క్షణాల్లోనే రైలు ముందుకు కదిలి వెళ్లిపోయింది. క్షణకాలం ఆలస్యమైనా వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. “క్షణిక సుఖం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
