• డిడబ్ల్యూవో హేమా భార్గవి, ఎంపీడీవో మధులత
నర్సాపూర్(ప్రజాజ్యోతి) బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీడబ్ల్యూవో హేమభార్గవి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని రైతువేదికలో మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హేమభార్గవి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరుగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే అంగన్‌వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యతని హెచ్చరించారు. మెదక్ జిల్లాను బాల్యవివాహాలు జరగని జిల్లాగా మార్చాలన్నారు. పిల్లల చేత పని చేయించడం నేరమని, బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని సూచించారు. “అనంతరం ఎంపీడీవో మధులత మాట్లాడుతూ.. గ్రామాలలో, తాండాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్ రెడ్డి, ఐసీడీఎస్ మండల సూపర్వైజర్లు సరళ, కవిత, లక్ష్మీనర్సమ్మ, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఐకేపీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
