హైదరాబాద్‌లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో భాగ్యనగరవాసులు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటోంది.
వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం శనివారం నగరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువని వారు వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కూడా మంచు ప్రభావం కనిపిస్తోంది.
నగర కేంద్రంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పటాన్‌చెరులో అత్యల్పంగా 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, దుండిగల్‌లో 15 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 17, హకీంపేటలో 17.1, రాజేంద్రనగర్‌లో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
