వైట్‌హౌస్‌లో అనూహ్య ఘటన.. ట్రంప్ ప్రసంగిస్తుండగా కుప్పకూలిన వ్యక్తి.. ఉలిక్కిపడ్డ‌ అధ్యక్షుడు

V. Sai Krishna Reddy
2 Min Read

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఓ కార్యక్రమం జరుగుతుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకే నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఈ పరిణామంతో అక్కడున్న వారితో పాటు ట్రంప్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బరువు తగ్గించే మందుల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ఫార్మా దిగ్గజాలైన ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలీ లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ మాట్లాడుతుండగా, ట్రంప్ కూర్చున్న టేబుల్ వెనుక నిలబడిన వారిలో ఒకరు సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే అక్కడున్న వారు అతడికి సహాయం చేశారు. ఆ సమయంలో కూర్చుని ఉన్న ట్రంప్, ఒక్కసారిగా లేచి నిలబడి పరిస్థితిని గమనించారు. మెడికేర్, మెడికేయిడ్ సేవల కేంద్రం నిర్వాహకుడైన మెహమెత్ ఓజ్ ఆ వ్యక్తిని పరీక్షించి, అతను బాగానే ఉన్నారని తెలిపారు. దాదాపు 30 నిమిషాలుగా నిలబడే ఉండటంతో అతడు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత మీడియాను బయటకు పంపించి కార్యక్రమాన్ని గంటపాటు నిలిపివేశారు.

కార్యక్రమం తిరిగి ప్రారంభమైన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ… “అతనికి కొద్దిగా కళ్లు తిరిగాయి… కింద పడిపోవడం మీరు చూశారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. వైద్యుల సంరక్షణలో ఉన్నాడు” అని వివరించారు. అనంతరం ఎలీ లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ స్పందిస్తూ, ఆ వ్యక్తి తమ కంపెనీ గెస్ట్ అని, అతని పేరు గోర్డాన్ అని తెలిపారు. “ఓవల్ ఆఫీసు చాలా వెచ్చగా ఉంటుంది, చాలాసేపు నిలబడాల్సి వస్తుంది. అందుకే అతను సొమ్మసిల్లాడు. వైట్‌హౌస్ వైద్య సిబ్బంది అద్భుతంగా స్పందించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు” అని చెప్పారు.

బరువు తగ్గించే జెప్‌బౌండ్, వెగోవీ వంటి ప్రముఖ మందుల ధరలను తగ్గించేందుకు ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ కంపెనీలతో ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రతిగా ఆ కంపెనీలకు టారిఫ్‌ల నుంచి ఉపశమనం కల్పించనున్నారు. “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” రేట్లకు ఈ మందులను అమెరికన్లకు అందిస్తామని, దీనివల్ల అర్హులైన వారికి ఖర్చులు భారీగా తగ్గుతాయని ట్రంప్ తెలిపారు.

ఇటీవలి కాలంలో ఆకలిని తగ్గించే జీఎల్‌పీ-1 అగోనిస్ట్ మందులకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. అయితే, అమెరికాలో నెలకు 1,000 డాలర్లకు పైగా ఖర్చవుతుండటంతో వాటి అధిక ధరలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *