రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోదీ జిల్లాలో గత రాత్రి వేగంగా వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ కోలాయత్ ఆలయాన్ని దర్శించుకుని జోధ్‌పూర్‌లోని తమ స్వస్థలమైన ఫలోదీకి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భరత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై టెంపో ట్రావెలర్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మరో ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో పలువురు ప్రయాణికులు వాహనంలోనే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు సీట్లలో ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీయడం చాలా కష్టంగా మారిందని ఫలోదీ పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి జోధ్‌పూర్‌కు తరలించారు.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం భజన్‌లాల్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
