ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా, భారత్‌లో 800 నుంచి 1,000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. తన కార్పొరేట్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. భారత్‌లోనూ తొలగింపులు ఉండనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్ విభాగాల్లో ఈ తొలగింపులు ఉండవచ్చని భావిస్తున్నారు. అమెజాన్ సీఈవోగా ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో లేఆఫ్‌లు అధికమయ్యాయి. జనరేటివ్ ఏఐ వల్ల రాబోయే కొన్నేళ్లలో తమ కార్పొరేట్ సిబ్బంది సంఖ్య తగ్గొచ్చని గతంలో ఆయన స్వయంగా వెల్లడించారు. 2023 మార్చిలో 9 వేల మందిని, ఆ తర్వాత రెండు నెలలకు 18,000 మందిని తొలగించింది. ఆ తొలగింపులో భారత్‌లో 500 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రస్తుతం కంపెనీ ఏఐపై అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో తాజాగా 14 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది. తొలుత 30 వేల మందిని తొలగిస్తారని వార్తలు వచ్చాయి. తొలగించనున్న 14 వేల మంది ఉద్యోగులకు కంపెనీలోనే కొత్త ఉద్యోగ అవకాశాన్ని వెతుక్కోవడానికి మూడు నెలల సమయం ఇస్తామని తెలిపింది. ఈ సదుపాయం వాడుకోవడం ఇష్టంలేని వారికి సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాల రూపేణా కంపెనీ నుంచి సహకారం అందుతుందని హామీ ఇచ్చింది.
