ప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్)లో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోంది. చట్టబద్ధంగా మద్యం తాగే వయసున్న ప్రతీ ముగ్గురు యువకుల్లో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదని ఓ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ నివేదిక, మారుతున్న యువత ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది.
ఆరోగ్యంగా ఉండాలనే కోరిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది (87 శాతం) మద్యానికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. వీరితో పాటు, డబ్బు ఆదా చేసుకోవడం (30శాతం), నిద్ర నాణ్యతను మెరుగుపర్చుకోవడం (25 శాతం) వంటి కారణాలు కూడా ఈ మార్పునకు దోహదపడుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే మద్యం వినియోగం అలవాటు ఉన్నవారిలో కూడా మార్పు కనిపిస్తోంది. 2020లో వారానికి ఒకసారైనా మద్యం తాగేవారు 23శాతం ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 17 శాతానికి పడిపోయింది.
మద్యం అలవాటు ఉన్నవారు కూడా దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో 53 శాతం మంది ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించుకోవాలని చూస్తుండగా, ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య 44 శాతం మాత్రమే. ముఖ్యంగా ‘జీబ్రా స్ట్రైపింగ్’ అనే కొత్త ట్రెండ్ యువతలో ప్రాచుర్యం పొందుతోంది. ఒకే చోట స్నేహితులతో కూర్చున్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరోసారి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని ‘జీబ్రా స్ట్రైపింగ్’ అంటారు. ఈ విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్త ట్రెండ్‌కు భిన్నంగా భారత్‌లో మాత్రం మద్యం వినియోగం పెరగనుండటం గమనార్హం. 2024 నుంచి 2029 మధ్యకాలంలో మనదేశంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం అదనంగా 357 మిలియన్ లీటర్లు పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి అని నివేదిక అంచనా వేసింది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2024లో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ కేవలం 0.6 శాతం వృద్ధి చెంది 1.7 ట్రిలియన్ డాలర్లకు చేరగా, నాన్-ఆల్కహాలిక్ స్పిరిట్స్ 17 శాతం, నాన్-ఆల్కహాలిక్ బీర్ 11 శాతం, నాన్-ఆల్కహాలిక్ వైన్ 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రానున్న ఐదేళ్లలో (2025-2029) నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ 24 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
					