ప్రపంచ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా నిలపడమే తన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఐటీ, ఫార్మా రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమ తనకు అండగా నిలిస్తే హాలీవుడ్‌ను సైతం హైదరాబాద్‌కు తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
హాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్‌లో జరిగేలా చూస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కార్మికుల కష్టాలు తనకు తెలియవనే భావన ఎవరికీ వద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా సినిమా అవార్డులు ఇవ్వలేదని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు.
ఫ్యూచర్ సిటీలో సినిమా పరిశ్రమకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలను నిర్మించి, ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కూడా అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్లు డిపాజిట్ చేస్తామని ఆయన వెల్లడించారు. సినిమా టిక్కెట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని సూచించారు. కార్మికులకు లాభాల్లో 20 శాతం వాటా ఇస్తేనే టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
