అమెజాన్‌లో భారీ ఉద్యోగాల కోత.. 30,000 మందిపై వేటుకు రంగం సిద్ధం

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా, మంగళవారం నుంచి ఏకంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం 15.5 లక్షల మంది అమెజాన్ ఉద్యోగులతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, కంపెనీలోని 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో ఇది దాదాపు 10 శాతానికి సమానం. 2022 చివర్లో 27,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఇదే అతిపెద్ద లేఆఫ్ కావడం గమనార్హం. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు.

ఈ ఉద్యోగాల కోత ప్రభావం హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ), ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వంటి పలు కీలక విభాగాలపై ఉండే అవకాశం ఉంది. ప్రభావిత ఉద్యోగులకు మంగళవారం ఉదయం నుంచి ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందితో ఎలా వ్యవహరించాలనే అంశంపై సోమవారం మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

లేఆఫ్స్‌కు కారణాలివేనా?
కంపెనీలో అనవసరమైన ప్రక్రియలను తగ్గించేందుకు సీఈఓ ఆండీ జెస్సీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దీనికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరగడం వల్ల పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేస్తూ సిబ్బందిని తగ్గిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో అమలు చేసిన ‘వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలి’ అనే నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలుగుతారని కంపెనీ ఆశించినా, అది జరగకపోవడం కూడా ఈ భారీ లేఆఫ్స్‌కు ఓ కారణంగా తెలుస్తోంది.

ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, రానున్న పండగల సీజన్ కోసం గిడ్డంగులు, ఇతర అవసరాల నిమిత్తం 2.5 లక్షల మంది తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని అమెజాన్ యోచిస్తోంది. కాగా, కంపెనీకి అత్యంత లాభదాయకమైన ఏడబ్ల్యూఎస్ విభాగం వృద్ధిరేటు, పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ కంటే వెనుకబడింది. అమెజాన్ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *