- పించన్ తీసుకో.. బిల్లు కట్టుకో..!
- ఆత్మకూరులో పంచాయతీ సిబ్బంది ధోరణిపై లబ్ధిదారుల ఆగ్రహం
- పేదల పెన్షన్‌పై పంచాయతీ పన్నుల ఘాటు
ఆత్మకూరు, అక్టోబర్ 26 (ప్రజాజ్యోతి):
పేదలకు జీవనాధారంగా ప్రభుత్వం అందించే పెన్షన్.. కానీ ఆత్మకూరు పంచాయతీ సిబ్బంది దాన్ని వసూలు వేదికగా మార్చేశారు. ఆదివారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ పంపిణీ జరుగుతుండగా, అదే ప్రాంగణంలో సిబ్బంది ఓ కౌంటర్ ఏర్పాటు చేసి ఇంటి, నల్లా పన్నుల బిల్లులు వసూలు చేయడం లబ్ధిదారుల్లో ఆగ్రహం రేపింది.
“మా పిల్లలు కడతారు” అని చెప్పినా వినకుండా, బలవంతంగా బిల్లులు కట్టించారని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పంచాయతీకి సెలవు రోజు అయినప్పటికీ బిల్లులు వసూలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
“పెన్షన్ కోసం వస్తే బిల్లు కట్టమంటున్నారు… ఇది ఏ రకం న్యాయం?” అంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న డబ్బుపైనా పంచాయతీ సిబ్బంది మోపుతున్న ఒత్తిడి నిరసనలకు దారితీస్తోంది.
గ్రామస్థులు అధికారులను తక్షణం స్పందించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “పేదల పెన్షన్‌పై పంచాయతీ పన్నుల గాటు!”
ఆత్మకూరులో అధికారుల నిర్వాకం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.
