భారత క్రికెట్ జట్టు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కూడిన తొలి బృందం ఈరోజు ఉదయం ఆస్ట్రేలియాకు పయనమైంది. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ, రోహిత్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతుండగా, వారిద్దరూ జట్టులో ఉండగానే గిల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనుండటం ఈ టూర్‌పై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జట్టులోని మిగిలిన సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన రెండో బృందం ఈరోజు రాత్రి 9 గంటలకు ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. అక్కడికి చేరుకున్నాక భారత ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటారు. అనంతరం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొని పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతారు.
ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈనెల 19న పెర్త్ స్టేడియంలో జరిగే తొలి వన్డేతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 23న అడిలైడ్ ఓవల్, 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం 29 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది.
విదేశీ గడ్డపై తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్న టీమిండియాకు ఈ పర్యటన ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. చివరిసారిగా 2020-21లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు భారత్ 1-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయి, అదే తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని యువ కెప్టెన్ గిల్ నేతృత్వంలోని జట్టు పట్టుదలగా ఉంది