స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సోమవారం అర్ధరాత్రి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉండటంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది.
గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తదితరులు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రవి వర్మలతో జూమ్ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హైకోర్టు ఏ కారణాలతో స్టే విధించింది, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తే అనుకూల ఫలితం వస్తుందనే దానిపై లోతుగా మంతనాలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలతో తుది పిటిషన్ను సిద్ధం చేసి దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమ వాదనలు పూర్తిగా వినకుండానే హైకోర్టు ఏకపక్షంగా జీవో 9పై స్టే విధించిందని ప్రభుత్వం తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నట్లు సమాచారం. “రాష్ట్రంలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందని కులగణన సర్వేలో తేలింది. ప్రత్యేక కమిషన్ నివేదిక, జనాభా నిష్పత్తి ఆధారంగానే వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాం. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరం. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం” అని మహేశ్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.