- కటాక్షపూర్ మత్తడి కష్టాలు తీరినట్టే..!!
- 15 లక్షల వ్యయంతో కటాక్ష పూర్ ‘కాజ్ వే’ నిర్మాణం
- హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
- కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణం పై నేషనల్ హైవేస్, సాగునీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
హనుమకొండ / ఆత్మకూరు, అక్టోబర్ 13( ప్రజాజ్యోతి):
కటాక్షపూర్ మత్తడి కష్టాలు ప్రయాణికులకు ఇక తీరనున్నాయి. మత్తడి లో పడుతున్న గుంతలతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం అయ్యే వరకు ‘కాజ్ వే’ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
జాతీయ రహదారి కావటంతో రవాణా ఎక్కువ ఉండటం, క్రషర్లు, మట్టి క్వారీల కు సంబందించిన లారీలు నిత్యం ఓవర్ లోడ్ తో వెళ్ళటం కారణంగా రోడ్డు తొందరగా గుంతలు పడుతున్నాయి. ఓవర్ లోడ్ లారీలపై దృష్టి పెడితేనే నూతనంగా నిర్మించే కాజ్ వే కాపాడగలమని స్థానికులు చెపుతున్నారు. “
వరంగల్ ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్ష పూర్ పెద్ద చెరువు మత్తడి పై కాజ్ వే నిర్మాణ పనులను రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కటాక్ష పూర్ కాజ్ వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కటాక్ష పూర్ చెరువులోకి వరద నీరు ఎక్కడి నుండి వస్తుందని, కాజ్ వే నిర్మాణం చేపట్టడానికి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఉన్న అవకాశాలు, తదితర అంశాలపై సాగునీటిపారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కటాక్ష పూర్ చెరువులోకి ఎగువ ప్రాంతంలో ఉన్న మల్లంపల్లి వైపు నుంచి నీరు వచ్చి చేరుతుందని, దీంతో చెరువులో నీరు ఎక్కువగా ఉండి కిందకు ప్రవహిస్తుందని సాగునీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ కు సమాధానం ఇచ్చారు. కటాక్ష పూర్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతిరోజు చర్యలు చేపడుతున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పైనుండి వస్తున్న వరద నీరు కారణంగా రహదారి దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాజ్ వే నిర్మాణానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ఇరు శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ కటాక్ష పూర్ వద్ద ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడం ద్వారానే కాజ్ వే నిర్మాణ పనులు సాధ్యమవుతుందన్నారు. కాజు వే నిర్మాణం కోసం కటాక్ష పూర్ చెరువు పై నుండి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎలా కట్టడి చేయవచ్చునో సాగునీటి పారుదల శాఖ అధికారులు సమగ్ర వివరాలను అందజేయాలన్నారు. వీలైనంత తొందరగా కాజ్ వే నిర్మాణ పనులు పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, జాతీయ రహదారుల శాఖ డిఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్, సాగు నీటిపారుదల శాఖ డిఈ సునీత, ఏఈ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.