ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర నిరసనకు సిద్ధమైంది. ఈ విధానం వల్ల తమ సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఏకంగా 300 మందితో నామినేషన్లు వేయించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ ఆవేదనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ వర్గీకరణ విధానం వల్ల గ్రూప్-3లోని 25 మాల కులాలకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలను అన్ని రంగాల్లో నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మందాల భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచడంతో పాటు, మొదటి 20 రోస్టర్ పాయింట్లలో రెండు కేటాయించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలకాలని ఆయన మాల సమాజానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమికి కంకణం కట్టుకుంటామని హెచ్చరించారు. మాలల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించకపోతే, కాంగ్రెస్ పార్టీ అంతమే తమ పంతంగా నిరసన యుద్ధాన్ని కొనసాగిస్తామని మందాల భాస్కర్ స్పష్టం చేశారు.