నేడే నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన… ట్రంప్ సహా అందిరిలో తీవ్ర ఉత్కంఠ

V. Sai Krishna Reddy
2 Min Read

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం-2025 విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు ప్రకటించనుంది. ఈసారి ఈ బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏకంగా ఏడు యుద్ధాలను తాను ముగించానని, మరొక వివాదంలో మధ్యవర్తిగా నిలిచానని ట్రంప్ స్వయంగా ప్రకటించుకోవడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది.

గత రెండేళ్లుగా భీకరంగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపడంలో తనదే కీలక పాత్ర అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తాను తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని ఆయన తెలిపారు. గత వారం తాను ఆవిష్కరించిన 20-అంశాల శాంతి ప్రణాళికే ఇందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. “నోబెల్ శాంతి బహుమతి నాకే ఇవ్వాలని అందరూ అంటున్నారు. నేను ఏడు యుద్ధాలను ఆపాను. ఏ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి నా దరిదాపుల్లోకి కూడా రాలేరు” అని గత నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్, కంబోడియా-థాయిలాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండా, ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలను కూడా తానే పరిష్కరించినట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ వాదనల్లో కొన్నింటికి ప్రత్యర్థి దేశాల నుంచి మద్దతు లభించగా, మరికొన్ని వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో ట్రంప్ పాత్ర ఉందని పాకిస్థాన్ అంగీకరించగా, భారత్ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు.

ట్రంప్ అభ్యర్థిత్వాన్ని పలు దేశాల నేతలు బలంగా సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, కంబోడియా ప్రధాని హున్ మానెట్, ఆర్మేనియా, అజర్‌బైజాన్ అధ్యక్షులు సంయుక్తంగా ఆయన పేరును ప్రతిపాదించారు. అయితే, ఒకవైపు శాంతి యత్నాలు చేస్తూనే, మరోవైపు ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటి దేశాలపై సైనిక దాడులకు ఆదేశించడం ఆయనపై విమర్శలకు తావిస్తోంది. తన పేరు ఒబామా అయి ఉంటే, పది సెకన్లలోనే నోబెల్ బహుమతి ఇచ్చేవారని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

గతంలో హెన్రీ కిస్సింజర్, ఆంగ్ సాన్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ విషయంలో నోబెల్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పురస్కార ఎంపికతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, అది పూర్తిగా స్వతంత్ర కమిటీ నిర్ణయమని నార్వే ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ దేశాల కళ్లన్నీ నేటి ప్రకటనపైనే నిలిచాయి. ట్రంప్ సహా అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *