గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకు అర్థమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద గ్రూప్-1 విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. యువకులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిందని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
గ్రూప్-1 పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలనే భర్తీ చేశారని ఎద్దేవా చేశారు. గ్రూప్-1 అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆయనను నమ్మారని, వారి పక్షాన నిలబడాలని సూచించారు.