తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి అందిన నివేదికలో, డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత ముఖ్యమైన ఆధారాలు సేకరించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో జరిగిన విచారణ సందర్భంగా, ప్రభాకర్ రావు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు అధికారులకు సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బలమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.