- రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరి మృతి
- దామెర మండలంలో విషాదం
దామెర, అక్టోబర్ 03 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామంలో ఒక కుటుంబ కార్యక్రమం అనంతరం విషాదం చోటుచేసుకోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి అశోక్ (28) తన బామ్మర్ది, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తో కలిసి ఊరుగొండలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉంటుండగా, ఎదురుగా వస్తున్న హనుమకొండ వైపు వెళుతున్న చరణ్ నడుపుతున్న బైక్ ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్ర గాయాలపాలైన రాజ్‌కుమార్, చరణ్ లను స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజ్ఆ కుమార్ ను హైద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాదంలో తీవ్ర గాయాలు పొందిన చరణ్ కూడా చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనతో ఊరుగొండ, తరాలపల్లి గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. అశోక్ యువకుడే కావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

