ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ట్రూఅప్ పేరుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన సుమారు 923.55 కోట్లను ప్రస్తుతం మినహాయించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఏపీఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది.
గత ఐదేళ్లలో ట్రూఅప్ పేరుతో విద్యుత్ ఛార్జీల బాదుడే తెలిసిన వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) ను పరిచయం చేస్తోందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు రూ.2,758.76 కోట్లకు ట్రూఅప్ కోసం దాఖలు చేయగా ఏపీఈఆర్సీ మాత్రం రూ.1,863.64 కోట్లకే ఆమోదం తెలిపింది.
డిస్కంలు వినియోగదారుల నుంచి రూ. 2,787 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఆ మొత్తం నుంచి రూ. 1,863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. దీంతో ఈ మొత్తాన్ని ట్రూడౌన్ ఛార్జీల రూపంలో నవంబర్ నుంచి వచ్చే ఏడాది అనగా 2026 అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీని వల్ల యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ట్రూఅప్.. ట్రూడౌన్..
ట్రూఅప్ అంటే ఛార్జీల పెంపు అయితే.. ట్రూడౌన్ అంటే ఛార్జీల తగ్గింపు. వినియోగదారుల నుంచి ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ ఖర్చు అయితే.. డిస్కంల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి వినియోగదారులకు సర్దుబాటు చేయడాన్నే ట్రూడౌన్ అంటారు.