- సొసైటీకి బకాయి పడ్డ డైరెక్టర్ల పదవులు రద్దు
దామెర, సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి):
ప్రాథమిక సహకార సంఘాలకు బకాయిలు ఉన్న డైరెక్టర్, చైర్మన్ పదవులను రద్దు పరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో కొనసాగుతున్న పెద్దాపూర్ (ఆత్మకూరు మండలం) సొసైటీ చైర్మన్ మరియు ఏడుగురు డైరెక్టర్లను వారి పదవులను రద్దు పరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ బొల్లు రాజు, వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, మరియు డైరెక్టర్లు లక్కిడి శివరామయ్య, ఆవుల శ్రీనివాస్, పౌడాల మధుకర్, మాధారపు రతన్ కుమార్, గుండా చంద్రమోహన్, శనిగరం సంతోష్ లను వారి పదవుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్లు సొసైటీకి బాకీ ఉన్న నేపథ్యంలో వారు పదవులకు అనర్హులుగా గుర్తించి సొసైటీ చట్టం ప్రకారం రద్దు పరిచారు. ఈ మధ్యకాలంలో వారి పదవులు పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వం వీరి పదవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బాకీ ఉన్న సొసైటీ పాలక వర్గం జాబితా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అందులో సొసైటీలో డైరెక్టర్లుగా, చైర్మన్ లుగా కొనసాగుతున్న కొందరు పెద్ద మొత్తంలో బాకీ ఉండడంతో ప్రభుత్వం సొసైటీ చట్టం ప్రకారంగా వీరు అనర్హులుగా గుర్తిస్తూ వీరి పదవులను రద్దు పరిచింది. సహకార చట్టం నిబంధనల ప్రకారం తాను బకాయి పడ్డ వ్యక్తి సొసైటీ సభ్యుల నుండి బకాయిలు వసూలు చేయలేడని భావిస్తు ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి వీరి పదవులను రద్దుపరిచింది. ఈ మేరకు డిసిఓ సంజీవ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.