ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుగుతున్నందునే, ఆ భయంతో బీఆర్ఎస్ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వారి చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ఇది క్షమించరాని తప్పిదమని ఆమె అన్నారు.
ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరు కావడం ద్వారా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని రేణుకా చౌదరి మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేవి కేవలం నంబర్లకు సంబంధించిన విషయమేనని, కానీ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండటం మాత్రం చాలా పెద్ద తప్పిదమని ఆమె పేర్కొన్నారు.
భారత ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు, బీజేడీకి చెందిన ఏడుగురు, అకాలీదళ్ నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తీరుపై రేణుకా చౌదరి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
					