రాష్ట్రవ్యాప్తంగా పార్టీల కార్యాలయాల్లో పోస్టర్ల తొలగింత
ఫ్లెక్సీలు, కటౌట్‌లు, బ్యానర్లను తొలగించిన పార్టీ శ్రేణులు
కవితకు వ్యతిరేకంగా హుస్నాబాద్‌లో ధర్నా
ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆమె పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా కార్యాలయాల లోపల, వెలుపల ఉన్న ఫ్లెక్సీలను, కటౌట్‌లను, బ్యానర్లను పార్టీ శ్రేణులు తొలగిస్తున్నాయి.
మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నిరసన తెలిపింది. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హరీశ్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయారని, ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఏం చెబితే అది చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పార్టీలోని నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కవిత ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసులకు భయపడి కవిత బీజేపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు.