కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన కుండపోత వర్షాలు
జలమయమైన పట్టణాలు, గ్రామాలు.. నిలిచిన జనజీవనం
హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారి, రైల్వే ట్రాకులపైకి వరద నీరు
గోడకూలిన ఘటనలో వైద్యుడి మృతి.. వరదల్లో చిక్కుకున్న రైతులు
డ్రోన్లతో ఆహారం సరఫరా.. రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్
పరిస్థితిని సమీక్షించిన మంత్రులు.. అదనపు సహాయక బృందాల తరలింపు
తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను అసాధారణ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో ఈ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లోనే 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పట్టణాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలోని రాజాంపేటలో బుధవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రికార్డు స్థాయిలో 41.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో 28 సెం.మీ., భిక్నూర్‌లో 23.8 సెం.మీ. వర్షం కురిసింది. మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్‌లో 26.13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ అసాధారణ వర్షాల ధాటికి వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి వరద నీరు ఊళ్లలోకి ప్రవేశించింది.
స్తంభించిన రవాణా వ్యవస్థ
భారీ వరదల కారణంగా హైదరాబాద్-నిజామాబాద్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మెదక్ జిల్లా నర్సింగి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వందలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్నూర్-తల్మడ్ల, ఆకన్‌పేట-మెదక్ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాకులు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించింది.
విషాద ఘటనలు, సహాయక చర్యలు
ఈ ప్రకృతి విపత్తులో విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి వినయ్ అనే వైద్యుడు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరులో పశువులను మేపడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా, మరో రైతు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిలో ఒకరితో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్‌లో మాట్లాడి, వారిని రక్షించేందుకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే పర్యవేక్షణలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో నిత్యావసరాలు, ఆహారాన్ని అందించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలంలొని నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోగా, అందులోని వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 504 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్లారెడ్డి మండలం బొగ్గుగూడెం వద్ద వాగులో చిక్కుకున్న ట్యాంకర్‌పై ఉన్న తొమ్మిది మందిని ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు రక్షించారు.
ప్రభుత్వం అప్రమత్తం
వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మెదక్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని రెవెన్యూ మంత్రి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులోని నాగిరెడ్డిపేట మండలంలో పోచారం జలాశయం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సుమారు 8 అడుగుల ఎత్తున 1.30 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంపై నుంచి వెళ్తుండటంతో సమీప ప్రాంతాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు.