అమెరికాకు మర్యాద ఇవ్వని దేశాలపై టారిఫ్ లు విధించే విషయంలో వెనక్కి తగ్గబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అగ్రరాజ్యంలోని పలు చిప్ కంపెనీల పట్ల విదేశాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో తాజాగా ఓ పోస్టు పెట్టారు.
అమెరికాకు చెందిన చిప్ కంపెనీల ఎగుమతులపై వివిధ దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అదే సమయంలో చైనా కంపెనీల పట్ల అవే దేశాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వివక్షకు ఇకపై ముగింపు పలకాలని హెచ్చరించారు. అమెరికా పట్ల కనీస మర్యాద చూపకుండా తమ కంపెనీలపై భారీగా వసూలు చేస్తున్న సుంకాలను వెంటనే సవరించాలని సూచించారు.
లేనిపక్షంలో అమెరికా అధ్యక్షుడిగా ఆయా దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్ లు విధిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశానికే ప్రత్యేకమైన అత్యున్నత సాంకేతికత, చిప్ ల ఎగుమతిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. అమెరికా, అమెరికన్ కంపెనీలు ఇకపై ప్రపంచ దేశాలకు పిగ్గీ బ్యాంక్ లా ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశారు