రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలో దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దౌసా జిల్లాలోని బాపి సమీపంలో మనోహర్‌పూర్ హైవేపై జరిగింది.
వివరాల్లోకి వెళితే.. భక్తులతో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ స్పందించారు. “ప్రమాదంలో 10 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. తీవ్రంగా గాయపడిన 9 మందిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించాం. మరో ముగ్గురికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం” అని ఆయన తెలిపారు.
బాధితులంతా ఖాటు శ్యామ్ ఆలయ భక్తులేనని జిల్లా ఎస్పీ సాగర్ రాణా వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి రిఫర్ చేశామని ఆయన పేర్కొన్నారు. దైవ దర్శనం ముగించుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు