ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ – చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో భారత్ – చైనా మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు చైనా సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది.
2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్ – చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్‌లను భారత్ నిషేధించింది. చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. చైనా దిగుమతులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది.
అయితే, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా, చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.