బహుజనుల ఆరాధ్యం పండుగ సాయన్న.. !

Kamareddy
5 Min Read

బహుజనుల ఆరాధ్యం పండుగ సాయన్న.. !

ఆగష్టు 8 జయంతి సందర్భంగా

— డా.పోలం సైదులు,ఎం ఏ,బిఈడి,పీహెచ్డీ

రామారెడ్డి ఆగస్టు 07 (ప్రజా జ్యోతి)

ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టిన కిన్నెరతో ఆలపించే ఏకైక గానం పండుగసాయన్న చరిత్ర మాత్రమే.ప్రజలు సైతం మరీ అడిగి పాడించుకుంటున్నారంటనే అర్థమవుతుంది అందులోనిగొప్పతనం.ఎవరో మహానుభావులన్నట్లు “సింహాలు చరిత్ర రాసుకోకుంటే, వేటకుక్కలు రాసిందే చరిత్ర అవుతుందన్నట్లు “గత 165 సంవత్సరాలుగా బహుజనుల ఆరాధ్యదైవంలా పేరొంది,ప్రతి ఏటా మొహరం రోజుల్లో (08 ఆగష్టు,1860) జయంతి సందర్భంగా ప్రజలతో పూజలందుకుంటున్న మహావీరుడు చరిత్ర ఎక్కడుంది ? కావాలనే కనుమరుగు చేశారా? ఇంత సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చి,ఎందరో మేధావులు,కవులు,రచయితలున్న కూడా ఆ చరిత్రను వెలుగులోకి తెచ్చి,ప్రజల ముంగిట్లోకి తేలేకపోవడానికి ఏమైనా కారణాలున్నాయా? అని అనుమానం కలుగకమానని పరిస్థితి.ఒక వ్యక్తి నిస్వార్ధంగా,నిష్పక్షపాతంగా ప్రజల పాలిట ఆరాధ్యదైవంలా మారి,సమస్యల్లో ఉన్న వారికి చేయూతనిస్తే “గోరంతను కొండంతచేసి ప్రజలముందు ఉంచే తరుణం”లో ఉన్నాము.కానీ శతాబ్దంన్నర కాలంక్రిందట తెలంగాణను పాలించే నిజాంకాలంలో,అప్పట్లో వారి పరిపాలనలో భాగంగా,రజాకార్లు,భూస్వాములు,పెత్తందార్ల చేతుల్లో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో,వారికి ఎదురుతిరిగి,ఒక్కడితో ప్రారంభించి,తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని పాలకుల,గుండెల్లోనిద్రించి,సామాన్య,పేద,బహుజనుల పాలిట దేవుడిలా మారి,ఎందరికో మార్గనిర్దేశకులయ్యి,రాబోయేతరాల ఉజ్వల భవిష్యత్తుకై పోరాట బాటలువేసి,ఆ ప్రజల కోసమే తన ప్రాణాలను త్యాగంచేసిన ఆ మహావీరుడి చరిత్రను ఎందుకు కనుమరుగు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.రాజ్యం ఆ మహావీరుడు చరిత్ర పుటల్లోకి ఎక్కనీయకుండా ఎంతఅడ్డుపడినా,సంచార జాతులు,బడుగు,బలహీన వర్గాల ప్రజల మరియు బహుజనుల మదిలో శాశ్వతంగామెదులుతూ,కంఠంద్వారా తరాలు మారినా కథలరూపంలో ప్రజలకు అందుబాటులో ఉన్నదంటే ఆమహావీరుడు త్యాగం,గొప్పతనం ఏంటో తెలియకనే  తెలుస్తుంది.ఆ మహానుభావుడి చరిత్రను ప్రచారంలోకి తేకపోవడానికి రెండు విషయాలు చర్చకుతావు నిస్తున్నాయి.అవి ఒకటి ఆనాడు రాజ్యానికి ఎదురుతిరిగి పేద ప్రజలకోసం అహర్నిశలు తాపత్రయపడుతూ,శాశ్వతంగా వారిమదిలో స్థావరాన్ని ఏర్పరచుకొని,ఒక మార్గదర్శకుడుగా మారి,కోటలకే బుగులు పుట్టించే విధంగా,తన కార్యాచరణ రూపొందించుకుని,ప్రణాళికయుతంగా అమలు పరుస్తూ,ప్రజలపాలిట ఓ దైవంలా కొనసాగుతుంటే,రాబోయే ముప్పును ముందుగానే పసిగట్టి,అంతమొందించడానికి ప్రణాళికలు రచించి,అమలుపరుస్తూ,మరెవ్వరు ఆ విధంగా ఆలోచించకుండా ఉండటానికి అసలైన చరిత్రను కనుమరుగు చేస్తూ,ఒక బందిపోటు,గజదొంగగా చిత్రీకరించి,ఆనవాలు లేకుండా చేశారనడానికి కారణాలు కనిపించిన,ప్రజల మనసులో నిగూఢమై,తరాలుమారిన ఆయన గొప్పతనం ఇంకా సజీవంగా ఉన్నదంటే,అలాంటి చరిత్ర కలిగిన ఆ మహావీరుడిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు చైతన్యమయ్యి సామాజికన్యాయం కోసం అగ్రవర్ణపాలకులపై పోరాటాలు కొనసాగిస్తారనే భయం కావచ్చు.అలాగే రెండవకారణం పండుగసాయన్న ముదిరాజ్ కులానికి చెందినవాడు కావడం,బహుజనుల అండదండలు కొనసాగడం,జనాభా ప్రాతిపదికన అత్యధిక జనాభాతో ఉన్న ముదిరాజులు, దళిత,బహుజనుల అండదండలతో రాజ్యాన్నీ ఏలే సౌకర్యాలుండటం,అసలైన రాజ్యాలు ఏలిన రాజులుగా ముదిరాజులు చరిత్ర కలిగి ఉండటంతో,ఆ దిశగా అడుగులుపడి,ఆధిపత్య కులాలపాలిట పెనుశాపంగా మారుతుందనేభయంతోనే అటు ముదిరాజుల చరిత్రను,ఇటు ఆ కులానికిచెందినగొప్పవీరులచరిత్రను కనుమరుగు చేయడానికి ఈ.ప్రజాస్వామిక విధానంలో కావాలనే ప్రయత్నాలు జరిగాయనే అనుమానం తలెత్తకమానని పరిస్థితి నెలకొందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.ఒక్కసారిగాసంచారజాతుల కంఠంలో నిగూఢమైన చరిత్రను పరిశీలిస్తే పాలమూరు ముద్దుబిడ్డ, బహుజనుల సింహ స్వప్నం ,నిమ్నకులాలు,పేదప్రజల పాలిట ఆరాధదైవంలా పేరుగాంచిన పండుగ సాయన్న 1860 – 1890 కాలానికిచెందినవాడు.మహబూబ్ నగర్ కు సమీపంలోనున్న నవాబుపేటమండలం,మెరుగోనిపల్లి గ్రామంలో తల్లి సాయమ్మ ,తండ్రి అనంతయ్యకు జన్మించారు.సోదరుడు లక్ష్మయ్య ఉన్నారు.తండ్రి వృత్తిరీత్యా ముదిరాజ్ వంశీయులు కావడంతో చేపలు పడుతూ జీవనం కొనసాగించేవారు.సాయన్నకు చిన్నతనం నుండియే గ్రామీణ క్రీడలపట్ల మక్కువ ఎక్కువని తెలుస్తుంది.20 కిలోలరాయిని అవలీలగా ఒంటిచేత్తో పైకిఎత్తగలిగే సామర్థ్యం,5 యాటపిల్లలను అమాంతంగా ఎత్తుకోని గుట్టపైకి తీసుకెళ్ళే బలశాలి,పెద్దపులితో ఒంటరిపోరుచేసి మరుగున పెట్టించిన ధీరశాలి అని తెలుస్తుంది.ఆరోజుల్లో ప్రజాస్వామిక పాలనకు అవకాశంలేదు.నిజాం పాలకుల చేతుల్లో సంస్థానాల ఆధారంగా పాలనగావించబడుతున్న తరుణం.ఆ కాలంలోరజాకార్లు,భూస్వాములు,పెత్తందార్లఅరాచకాలు,ఆగడాలకు అంతేలేని సంధర్భం.అంతా గడీల ముసుగులోపాలనగావించబడేది.న్యాయాలకు తావేలేనిసంధర్భం.ఆపాలనలో పేదలు,నిమ్న కులస్తులు,ప్రజలు ఎలాంటి అవస్థలు పడ్డారో “వ్రాస్తే రామాయణమంతా – చెబుతేమహాభారతమంతా” ఉంటుంది.పండుగ సాయన్న తండ్రి అనంతయ్య దొరల వద్ద కొంతభూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడానికిపూనుకొని,భూమిలో నీటికోసం బావి  తోవ్వడంతో పుష్కలమైన జలం లభించింది.దానితో మంచి దిగుబడినిచ్చే పంట పండుతుండటంతో వాటిపై దొరలకన్నుపడి,కాజేయాలనే నెపంతో,అనుమతులు లేకుండా బావి త్రవ్వడానేనిందమోపి,ఇతర రకరకాల నేరాలను అంటగట్టి,బంధించి చింతబర్రెలతో చితకబాదినట్లు కథ ద్వారా తెలుస్తుంది.ఇంకా ఇదే సందర్భంలో సాయన్న చిన్నమ్మ పై సైతం అత్యాచారం జరగడం,వీటన్నింటినీ గమనించి,పరిశీలించిన సాయన్నకు పోరాటానికి ఉసిగొల్పాయని  తెలియకనే తెలుస్తోంది.ఇంకేముంది తక్షణమే కర్రసాము,కత్తిసాము,గుర్రపుస్వారీ పలురకాల విద్యలను నేర్చుకుని,తన మిత్రులతో కలిసి ఒక సైన్యం ఏర్పరచుకొని,నిజాం పెత్తందార్లకు ఎదురుతిరిగి,సాయుధ పోరాటానికి సిద్ధమై,ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు బుక్కెడు అన్నం పెట్టడానికి భూస్వాముల గోదాములపై దాడిచేసి దాన్ని తీసుకెళ్లి పేదల ఆకలితీర్చి,పేదల పాలిట పెన్నిధిగా మారారు.ఇదొక్కటే తన లక్ష్యం కాదు.మొదటగా పట్టెడన్నం పెట్టడమే ఆనాటి విప్లవం.కానీ క్రమంగా పరిణితి చెందుతూ అనగారిన బహుజన ప్రజలకు చదువుకోవాలని పిలుపునిస్తూ,చైతన్యపరుస్తూ ముందుకెళ్లారు.అలాగే కులనిర్మూలనకు పూనుకొని అన్నదానాలు,సహపంక్తి భోజనాలు పెట్టడంతోపాటు,పేదరిక కారణంతో పెళ్లిళ్లు చేయలేని వారికి నూతన వస్త్రాలు,తాళిబొట్టు,మెట్టెలు దానం చేస్తూ, ప్రజలకు ఎల్లమ్మ ,మైసమ్మలాంటి గుడులు కట్టిస్తూ గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు.కాలక్రమేణా పరిణామక్రమంలో భాగంగా తనదళాన్ని పునరుద్ధరించు కుంటూ ఎప్పటికప్పుడు తమ శిక్షణలో మెరుగులు దిద్దుకుంటూ,తుపాకీ పేల్చడం నేర్చుకుంటూ,పలురకాల ఆయుధాలను సేకరించడం జరిగింది.ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూస్తూ,పరిశీలిస్తూ జీర్ణించుకోలేక భూస్వాములు కరణం పటేల్,నాగిరెడ్డి దొర,ఖాన్సాబ్ లు సాయన్ననుఅంతమొందించడానికి ప్రణాళికలు రచించి,నిజాంపై ఒత్తిడితెచ్చి,ప్రణాళికాయుతంగా స్నేహితులతో పథకం వేస్తూ,రాంపూర్ కు చెందిన పెత్తందార్లు,తెలుగు నరసమ్మ ఇంటికొచ్చి బెదిరించి,సాయన్న వివరాలు సేకరించి,ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీచేసుకుంటున్న సాయన్నపై 60 మందిగల నిజాం సైన్యంతో ముట్టడించి,తప్పుడు కేసులు బనాయించి,అరెస్ట్ చేసి, జైల్లో పెట్టించడం జరిగింది. ఇంకేముంది ప్రజల్లో ఒకింత ఆగ్రహం మొదలై సాయన్నను విడుదల చేయాలనే  నినాదంతో ఆ ఊరి సత్తూరిరాములు గౌడ్,పరహా తుల్లా,బేగ్ సాబ్,రుక్మారెడ్డి,రాఘవులు అనే పెద్దమనుషులతో కలిసి,వనపర్తి మహారాణి అయినటువంటి శంకరమ్మపై ఒత్తిడి తేవడంతో,మొదటినుంచి గమనిస్తున్న రాణి,ప్రజల ఆదరాభిమానాలు పొందిన సాయన్న విడుదలకై నిజాం రాజు మీర్ మహమూద్ అలీని కలిసి విజ్ఞప్తి చేయడంతో,పదివేల రూపాయల జమానత్ కట్టాలని ఆదేశిస్తూ, ” మార్ మత్.చోడో ” (చంపకండి. వదిలేయండి) అనే హుకుం జారీచేశారు.ఆడబ్బును రాణిగారే కట్టి,విడిపించడానికి పూనుకోని నలుగురు పెద్దమనుషులతో శంకరమ్మ పాలమూరుకు చేరుకోగానే ప్రజలు వారికి పూలతో బ్రహ్మరథం పట్టారంటే ప్రజల మనసుల్లో సాయన్న ఎలా కీర్తించబడుతున్నారో అర్థంగాక మానదు.కానీ అనతికాలంలో ఎస్పీ తో జంగ్ జలాల్ఖాన్,మోహితి మిన్ సాబ్ భూస్వాముల మద్దతుతో పథకం ప్రకారం “మార్ .మత్ చోడ్ “(చంపేయండి. వదలకండి ) ఒక్క ముగింపు చుక్కని అటుఇటు చిత్రీకరించి మరణశిక్షవిధించి,తలనరికి మొండెం ఒకదగ్గర,తల ఒకదగ్గర విసిరేశారని తెలుస్తుంది.వెంటనే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోని వందలసంఖ్యలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి దాడిచేయగా అదిచూసిన ఎస్పీ అక్కడికక్కడే గుండెపోటుతో మరణించడం,సాయన్న మరణాన్ని సంతోషంతో ప్రభుత్వ వసతిగృహంలో దావత్ చేసుకుంటున్న నాగిరెడ్డి,వెంకట్రావు,పెద్దిరెడ్డి,రాంరెడ్డి తదితర భూస్వాముల జాడను తెలుసుకున్న ప్రజానీకం చుట్టుముట్టి తగల బెట్టడంతో వారు ఆమంటల్లోనే మాడిమసైపోయినట్లు సంచార జాతులు చెప్పే కథలద్వారా తెలుస్తుంది.ఇంతటి గణనీయమైన చరిత్ర కలిగిన పండుగ సాయన్న గురించి అధ్యయనంచేసి,కనుమరుగైన చరిత్రను వెలుగులోకి తెచ్చి ప్రజల ముంగిట్లో ఉంచి, జయంతి,వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రబుత్వాలపైననే ఉన్నది. ఏదిఏమైనా బహుజనులు ఇలాంటి వీరుల చరిత్రను సజీవంగా ఉంచుతూ,అందరికీ తెలుసేవిధంగా కార్యక్రమాలకు పూనుకోవాలని ఆశిద్దాం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *